బాలుకు భారతరత్న ఇవ్వండి.. మోదీకి జగన్ లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

బాలుకు భారతరత్న ఇవ్వండి.. మోదీకి జగన్ లేఖ

September 28, 2020

Ap cm jagan mohan reddy demands Bharat ratna to singer balasubrahmanam .

దివంగత ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యానికి భారతరత్న అవార్డు ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఆయనకు ఈ అవార్డు ఇవ్వాలని నటుడు అర్జున్ ఇదివరకే డిమాండ్ చేశారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా దీనిపై ముందుకెళ్తున్నారు. ఆ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని బాలుకు ఇవ్వాలని కోరుతూ ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సంగీతరంగానికి ఎంతో సేవ చేసిన బాలుకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరారు. 

“ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి గానగంధర్వుడు మా రాష్ట్రంలోని నెల్లూరులో జన్మించడం మా అదృష్టం.. ఆయన అకాల నిష్క్రమణం అభిమానులను, ప్రముఖులను కలతపెట్టింది. సంగీత ప్రియులు కన్నీళ్లు పెట్టారు.  ఆయన తన మాతృభాష తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో 40 వేలకు పైగా పాటలు పాడారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా 6 జాతీయ అవార్డులు, 25 నంది అవార్డులు  సాధించారు. గతంలో  లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, ఎంఎస్ సుబ్బులక్ష్మి, బిస్మిల్లా ఖాన్, భీమ్ సేన్ జోషి వంటి సంగీత దిగ్గజాలకు కేంద్రం భారతరత్న ప్రకటించింది.  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కూడా భారతరత్న ప్రకటించి నివాళి అర్పించాలి. 50 ఏళ్లపాటు ఆయన అందించిన సంగీత సేవలకు ఇదే అత్యున్నత గుర్తింపు..’ అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.

బాలు మృతికి మోదీ కూడా సంతాపం తెలపడం విదితమే. తమ తండ్రికి భారతరత్న పురస్కారం ప్రకటిస్తే సంతోషిస్తామని బాలు తనయుడు చరణ్ కూడా అన్నారు. కాగా, బాలు అంత్యక్రియలకు టాలీవుడ్ దిగ్గజ నటులు వెళ్లకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. బాలు కరోనా నుంచి కోలుకున్న తర్వాతే చనిపోయారని, ఆయనతో వందలు పాటలు పాడించుకున్న నటులు, నిర్మాతలు, దర్శకులు వెళ్లకపోవడం సరికాదని అంటున్నారు. బాలు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు.