ఏపీలో గత కొన్ని రోజులుగా పదవ తరగతి ప్రశ్నాపత్రాలు లీకవ్వడం, మాస్ కాపీయింగ్ పాల్పడడం వంటి వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు పనిగట్టుకొని ఈ చవకబారు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. గురువారం తిరుపతిలో ‘జగనన్న విద్యాదీవెన’ నిధులను సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ… కార్పోరేట్ స్కూల్స్ అని చెప్పుకుంటున్న నారాయణ, శ్రీచైతన్య స్కూల్స్ నుంచే పేపర్ల లీకులు అయ్యాయని చెప్పారు.
చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రిగా పనిచేసిన నారాయణకు చెందిన విద్యాసంస్థల నుంచే పరీక్షా ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని, లీక్ చేసిన పేపర్లను వాట్సాప్‌ల్లో పెట్టి ఒక వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారన్నారు. అంతా చేసి చివరకు దొంగే దొంగ అన్నట్లు తమ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని చెప్పారు. జగనన్న విద్యాదీవెనతో ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందోనని ఈ చర్యలకు తెగబడ్డారని బహిరంగ సభలో తెలిపారు.