ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థి ముర్మును గెలుపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం జగన్. ఈ మేరకు మంగళగిరి సీకే కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు తొలిసారి అవకాశం లభించింది. వైఎస్సార్సీపీ మొదటి నుంచి సామాజిక న్యాయం వైపే ఉంది. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన ప్రభుత్వం మనది. మనమంతా ముర్ముకే ఓటేసి గెలిపించుకోవాలి. ఏ ఒక్క ఓటు వృథా కాకుండా చూసుకోవాలి’ అని అన్నారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముర్ముకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఓటు వేసే ముందు కచ్చితంగా మాక్ పోలింగ్లో పాల్గొనాలన్నారు. ఎమ్మెల్యేలు వచ్చి ఓటు వేసేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్యానించారు.
ఇక ఆ తర్వాత వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలని ఉద్దేశించి ప్రసంగించిన ద్రౌపది ముర్ము.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. నన్నయ్య, తిక్కన్న, పోతన, తెనాలి లాంటి తెలుగు కవులను స్మరించుకున్న ముర్ము.. తన ప్రసంగంలో అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ల పేర్లను ప్రస్తావించారు. తాను ఒడిశాలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చానన్నారు. గిరిజన మహిళనైన తాను ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. అడగక ముందే.. తన అభ్యర్థిత్వానికి మద్దతు పలికిన సీఎం వైఎస్ జగన్కు ముర్ము ధన్యవాదాలు తెలిపారు.