Ap Cm Ys Jagan Free Tabs To Students And Teachers
mictv telugu

8వ తరగతి విద్యార్థులకు సీఎం జగన్ ట్యాబ్‌ల పంపిణీ

December 21, 2022

Ap Cm Ys Jagan Free Tabs To Students And Teachers

పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానుక అందించారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్పొరేట్‌ విద్యను అందించాలన్న లక్ష్యంతో విద్యార్థులకు ఈ ట్యాబ్‌లను పంపిణీ చేస్తున్నారు. ప్రపంచంతో పోటీ పడేలా ఇప్పటి నుంచే వారికి శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

పుట్టిన రోజునాడే ఈ కార్యానికి శ్రీకారం చుట్టిన సీఎం.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. “నా పుట్టినరోజున నాకు ఎంతో ఇష్టమైన చిన్నారుల భవిష్యత్తు కోసం ఇంత అద్భుతమైన చేయగలుగుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన కంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని మనం కోరుకుంటాం. కానీ, నా ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు తల్లి తండ్రులు పడుతున్న బాధలు చూశాను. చదువుతోనే తలరాత మారుతుంది. ఈ మూడున్నర ఏళ్ళల్లో పిల్లలు అందరూ బాగా చదవాలని దృష్టి పెట్టాం. కీలక మార్పులు తీసుకొచ్చామని” చెప్పారు.

ఇక నుంచి ఏటా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ జరుగుతోందని స్పష్టం చేశారు సీఎం జగన్. ఇవి మల్టీ లాంగ్వేజ్ ట్యాబ్‌లు.. తెలుగు, ఇంగ్లీష్ మాత్రమే కాకుండా ఇతర భారతీయ భాషల్లోనూ పాఠాలు ఉంటాయని తెలిపారు.. రేపటి పౌరుల నేటి అవసరం ఈ ట్యాబ్‌లుగా పేర్కొన్న సీఎం.. అందరికీ సమాన నైపుణ్యాలు ఉండకపోవచ్చు.. కానీ, ఎదగటానికి సమాన అవకాశాలు ఉండాలి అన్నారు. తరగతిలో టీచర్ చెప్పే బోధనకు ట్యాబ్‌లు మరింత ఉపయోగపడతాయన్నారు. సెక్యూర్డ్ డిజిటల్ కార్డులు ఈ ట్యాబ్ లలో ఉన్నాయి.. నెట్ వర్క్ లేకపోయినా ఆఫ్ లైన్ లో ట్యాబ్ ఉపయోగించుకోవచ్చని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8 వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్ధులు, 59,176 మంది ఉపాధ్యాయులకు రూ. 778 కోట్ల బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌తో రూ. 686 కోట్ల విలువైన 5,18,740 శామ్‌సంగ్‌ ట్యాబ్‌లు ఉచితంగా అందించనున్నారు. రూ. 16,500 కు పైగా మార్కెట్‌ విలువ గల ట్యాబ్, దాదాపు రూ. 15,500 విలువ గల కంటెంట్‌తో కలిపి ప్రతి 8 వ తరగతి విద్యార్ధికి అందిస్తారు. ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసే విధంగా వీటిని రూపొందించారు. 4 నుండి 10 వ తరగతి చదువుతున్న 32 లక్షల మంది విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ. 15,500 విలువైన రూ. 4,960 కోట్ల బైజూస్‌ కంటెంట్‌ ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం 8 వ తరగతి చదువుతున్న విద్యార్ధులు 2025 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ విధానంలో ఇంగ్లీష్‌ మీడియంలో 10 వ తరగతి పరీక్ష రాసేలా పిల్లలను సన్నద్ధం చేస్తోంది జగన్ సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు ఈ బైజూస్ కంటెంట్ ట్యాబ్ లు పంపీణీ చేస్తారు.