ఏపీ సీఎం జగన్ బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను నివేదించి సహకరించాలని కోరారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలని విన్నవించారు. మోదీతో ప్రస్తావించిన అంశాలు ఇలా ఉన్నాయి. రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద ఉన్న బకాయి నిధులు రూ. 18,330 కోట్లు, పదవ వేతన సంఘం బకాయిలు, పెన్షన్ల వంటి బకాయిలు రూ. 32,625 కోట్లు మంజూరు చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే ఖర్చు చేసిన నిధులు రూ. 2,937 కోట్లు, ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,548 కోట్లకు ఆమోదం, నిర్వాసితుల ప్యాకేజీ నిధుల అంచనా రూ. 10,485 కోట్లు డీబీటీ ద్వారా చెల్లింపు, తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిలు రూ. 6,886 కోట్లు, రాష్ట్రానికి కేంద్రం వద్ద నిలువ ఉంచిన 3 లక్షల టన్నుల బియ్యంలో 77 వేల టన్నుల కేటాయింపు, ప్రత్యేక హోదా, 12 జిల్లాలకు నూతన మెడికల్ కాలేజీలు, కడప స్టీల్ ప్లాంటుకి గనుల కేటాయింపు, విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.