ఏపీ సీఎం  జగన్ ఇంట్లో విషాదం.. మామ గంగిరెడ్డి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ సీఎం  జగన్ ఇంట్లో విషాదం.. మామ గంగిరెడ్డి మృతి

October 3, 2020

jagann

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నివాసంలో విషాదం నెలకొంది. ఆయన మామ, వైఎస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చనిపోయారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతదేహాన్ని సొంత ఊరు పులివెందులకు తరలిస్తున్నారు. అక్కడే నేడు సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్ కూడా పులివెందులకు పయనం అయ్యారు. 

గంగిరెడ్డి పులివెందులలో డాక్టర్‌గా అందరికి సుపరిచితుడు. పేదల డాక్టర్‌గా మంచి పేరు సంపాధించుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ 2001-2005లో పులివెందుల ఎంపీపీగా పని చేశారు. ఆ తర్వాత తన అల్లుడు జగన్‌పై కేసులు నమోదు కావడంతో కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. 2003లో విత్తనాల కోసం రైతుల తరుపున తన నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేశారు. కాగా, అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన గంగిరెడ్డిని ఇటీవలే సీఎం జగన్ కూడా పరామర్శించారు. తిరుమల బ్రహ్మోత్సవాల తర్వాత నేరుగా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి వెళ్లారు. మరోవైపు నెల రోజుల క్రితమే ఆయన అన్న పెద్ద గంగిరెడ్డి కూడా అనారోగ్యంతో చనిపోవడంతో ఆ కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడాయి.