AP: Family doctor for every village: Jagan
mictv telugu

ఏపీ: పల్లె ప్రజలకు జగన్ శుభవార్త..సొంత ఊరిలోనే

July 14, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్లె ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ఓ శుభవార్తను చెప్పారు. స్వాత్రంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని ప్రతి మారుమూల పల్లెలో ఓ ఫ్యామిలీ డాక్టర్‌ను నియమించబోతున్నట్లు బుధవారం తెలిపారు. ఆ ఫ్యామిలీ డాక్టర్..ప్రతి వ్యక్తిని పరామర్శిస్తూ, వారి వ్యక్తిగత శ్రద్ధతో వైద్య సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య పథకం కింది ఈ డాక్టర్ సేవలతోపాటు, మరిన్ని చికిత్సలను అందిస్తామని, గ్రామీణ ప్రజలకు వ్యక్తిగత శ్రద్ధతో సొంత ఊరిలోనే మెరుగైన వైద్యం అందించే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నామని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.

ఈ కార్యక్రమంపై బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ”గత సర్కారు హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా కేవలం 1,059 చికిత్సలు మాత్రమే అందాయి. మన ఇప్పుడు వాటిని 2,446కి పెంచాం. ఇప్పుడు చికిత్సల సంఖ్యను 3,000కిపైగా పెంచుతున్నాం . ఆగస్టు 1వ తేదీ నుంచి పెంచిన చికిత్సలను పథకంలోకి చేర్చాలి. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో చేరే ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు వర్చువల్ బ్యాంకు ఖాతాలు తెరవాలి. చికిత్స అందించిన నెట్వర్క్ ఆసు త్రికి చెల్లించాల్సిన డబ్బులు తొలుత నేరుగా రోగి వర్చువల్ ఖాతాలోకి జమ చేయాలి. అనంతరం ఆస్పత్రికి బదిలీ కావాలి. ఈ పథకం కింద చికిత్స పొందిన రోగి నుంచి సమ్మతి (కన్సెంట్) పత్రం తీసుకోవాలి. ఏ జబ్బుకు చికిత్స అందించాం? ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? అనే వివరాలు అందులో రోగికి తెలియజేయాలి. వైద్యం అందించేందుకు ఆస్పత్రిలో ఎవరైనా డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారా? సేవలు ఎలా అందించారు? అనే విషయాలపై స్పష్టత తీసుకోవాలి” అని జగన్ అన్నారు.

మరోపక్క ఈ పథకం కింద చికిత్స అందించేందుకు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే, వెంటనే బాధితులు ఫిర్యాదు చేసేలా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 14400, వైద్య సేవలపై ఫిర్యాదుల కోసం 104 నంబర్ అందులో పొందుపరచాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కూడా ఇంటికి వెళ్లి డాక్టర్లు పరామర్శించేలా విధానాలను అమలు చేయాలని జగన్ పేర్కొన్నారు.