ఒక గ్రామీణ రైతు బిడ్డ జాతీయ స్థాయి అందాల పోటీల్లో పోటీ చేయనుంది. మార్చి 5న జరిగే ఫెమినా మిస్ ఇండియా పోటీలకు ఎంపికైంది గోమతి రెడ్డి. మరి ఆమె ప్రస్థానం ఎలా సాగిందో చదువండి. అందం, ఆత్మవిశ్వాసంతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే అద్భుతాలు చేయొచ్చని నిరూపించింది గోమతి రెడ్డి. అన్నమయ్య జిల్లా ఓబువారి పల్లె మండలం ముక్కావారి పల్లె గ్రామానికి చెందిన గోమతి రెడ్డి మిస్ ఆంధ్రాగా నిలిచింది. మరో రెండు వారాల్లో ముంబైలో జరిగే ఫెమినా మిస్ ఇండియా పోటీలకు ఎంపికైంది.
మోడల్ గా కూడా..
ముక్కా శ్రీనివాసుల రెడ్డి, అరుణ కుమారి దంపతుల ఏకైక కూతురు గోమతిరెడ్డి. శ్రీనివాసులు రైతు. కాకపోతే చిన్నప్పటి నుంచి గోమతి అన్ని పోటీల్లో రాణిస్తూ ఉండేది. దీంతో వారు ఆమెను అందాల పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సాహం అందించారు. డిగ్రీలో ఉన్నప్పుడు కూడా బెంగళూరులో నిర్వహించిన సౌత్ ఇండియా ఫెమినా పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. తర్వాత మోడలింగ్ రంగంలో ప్రవేశించింది. అటు మోడలింగ్ తో పాటు బెంగళూరులోని ఒక ఎమ్ఎన్ సీ కంపెనీలో సాఫ్ట్ వేర్ డెవలపర్ గా ఉద్యోగం చేస్తున్నది. రెండింటినీ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నది.
వారి సహకారమే..
జనవరి 25న ముంబైలో నిర్వహించిన ఫెమినా మిస్ ఆంధ్రా పోటీలు జరుగుతున్నాయని తెలుసుకున్నది గోమతి. వెంటనే అప్లై చేసింది. ఆ పోటీల్లో పాల్గొని టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో మిస్ ఇండియా పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరుపున పాల్గొననుంది. మిస్ వరల్డ్ సాధించడమే లక్ష్యంగా తన ప్రయాణం కొనసాగుతోందంటుంది గోమతి. తల్లిదండ్రులు ఇచ్చే సహాకారం తనను ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి దోహదపడుతుందంటున్నది.