AP: Farmers' march has ended...start from here
mictv telugu

ఏపీ: రైతుల పాదయాత్ర ఖరారు..ఇక్కడి నుంచే మొదలు

September 10, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా రైతుల మహా పాదయాత్రకు సంబంధించి పలు చర్చోపచర్చలు జరిగిన విషయం తెలిసిందే. మహా పాదయాత్రకు రాష్ట్ర పోలీసులు పర్మిషన్‌ ఇవ్వాలని కోరుతూ, రైతు సంఘాల నాయకులు అనుమతి పత్రం సమర్పించారు. దాంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి పాదయాత్రకు అనుమతిని నిరాకరిస్తూ, ఉత్తర్వుల ప్రతిని తిరిగి పంపించారు. దాంతో రైతు సంఘాల నాయకులు ఏపీ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. రైతుల మహా పాదయాత్రకు పర్మిషన్ ఇస్తూ, ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు తీర్పుతో అడ్డంకులు తొలగిపోవడంతో..రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఉద్యమం ప్రారంభమై, వెయ్యి రోజులకు చేరుకుంటున్న సందర్భంగా ఈ నెల 12న తుళ్లూరు మండలం వెంకటపాలెంలో మహా పాదయాత్ర మొదలవుతుందని తెలియజేశారు. దీనికి వేద పండితులు 12వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభించి, ఉదయం 6 గంటలకు పాదయాత్రకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన శ్రీవారి రథాన్ని ఆలయం నుంచి వెంకటపాలెం గ్రామంలోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.

ఆ తర్వాత 9 గంటలకు రథానికి జెండా ఊపి..లాంఛనంగా పాదయాత్రను ప్రారంభిస్తామని, ఈ కార్యక్రమానికి వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలను అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు ఐకాస సమన్వయ కమిటీ సభ్యులు ఆహ్వానిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. రైతుల పాదయాత్రలో పాల్గొనేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐ, ఆప్, కాంగ్రెస్ తదితర పార్టీలు అంగీకరించాయి.

”ఈ పాదయాత్ర వెంకటపాలెంలో మొదలై కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరికి చేరుకుంటుంది. ఆ రాత్రి అక్కడే బసచేస్తాం. ఈ పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేశాం. పాదయాత్రలో లోపాలు, ఇబ్బందులేవీ తలెత్తకుండా బాధ్యతలను అప్పగించాం. ఆహార, లాజిస్టిక్స్-1, 2, తాగునీరు, ఫైనాన్స్, ఆహ్వాన, రథం కమిటీలను ఏర్పాటు చేశాం. ఈసారి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా సిద్ధం చేశాం” అని నాయకులు తెలియజేశారు.