ఏపీ జాలరికి పండగ.. ఒక్క చేపకు 1.70 లక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ జాలరికి పండగ.. ఒక్క చేపకు 1.70 లక్షలు

September 23, 2020

AP fisherman festival .. Rs.1.70 lakhs per fish

రోజూవారీ వృత్తిలో భాగంగా ఆరోజు కూడా ఆ జాలరి చేపల వేటకు వెళ్లాడు. ఎప్పటి మాదిరిగానే ‘ఈరోజు అయినా ఆ గంగమ్మ తల్లి కరుణించి కాసిన్ని చేపలు నా వలకు ఎక్కువ పడితే ఎక్కువ డబ్బులు వస్తాయి. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో నా కుటుంబంతో ఆనందంగా ఉండొచ్చు’ అని భావించాడు ఆ జాలరి. అయితే అతని మనోవాంఛను గంగమ్మ విన్నట్టుంది. అతని వలకు ఓ చేప చిక్కింది. దానిని చూడగానే అతను ఒక్కసారిగా ఎగిరి గంతేశాడు. మరి అది అలాంటి ఇలాంటి చేప కాదు.. కచ్చిలి చేప. దాని విలువ అక్షరాలా రూ.1.70 లక్షలు ఉంటుంది. ఈ అరుదైన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.  

జిల్లాలోని చీరాల మండలం వాడరేవు తీరంలో దోనిదేవుడు అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లాడు. మంగళవారం అతని వలకు అనూహ్యంగా 28 కిలోల అరుదైన కచ్చిలి చేప చిక్కింది. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆ చేపను కొనుగోలు చేసేందుకు పలువురు పోటీలు పడ్డారు. చివరకు అదే ప్రాంతానికి చెందిన దారకొండ అనే వ్యాపారి రూ.1.70 లక్షలు పెట్టి ఆ చేపను కొనుగోలు చేశాడు. ఆ డబ్బులను చూసి దోనిదేవుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఈ చేప పొట్ట భాగాన్ని మెడిసిన్ తయారీలో వినియోగిస్తారని, అందుకే ఇంత ఖరీదు ఉంటుందని మత్స్యకారులు చెప్పారు. కాగా, ఇటీవల రెండున్నర కిలోల పులస చేపను పాశర్లపూడి గ్రామానికి చెందిన వైసీపీ నేత, నగర వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమ్ముల కొండలరావు ఏకంగా రూ.21 వేలు చెల్లించి సొంతం చేసుకున్నారు.