AP: flying of Rs.500 notes from an auto at Narasannapet toll plaza in Srikakulam district
mictv telugu

నడిరోడ్డుపై రూ.500 నోట్ల వర్షం.. ఆపకుండా వెళ్లిన ఆటో

March 5, 2023

 AP: flying of Rs.500 notes from an auto at Narasannapet toll plaza in Srikakulam district

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం నోట్ల వర్షం కురిసింది ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఓ ఆటోలో తరలిస్తున్న రూ.500 నోట్లు కొన్ని గాలిలో ఎగిరిపడటం పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలోని నరసన్నపేట మండలం మడపాం టోల్‌గేట్‌ వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గమనించిన టోల్‌గేట్‌ సిబ్బంది ఆటోడ్రైవర్‌ను కేకలు వేశారు. అయినా అతడు వినిపించుకోకుండా వెళ్లిపోవడంతో టోల్‌గేట్‌ సిబ్బంది రోడ్డుపై పడిన నోట్లను తీసుకున్నారు. రోడ్డు మీద ఉన్న వారు కేకలు వేసినా ఆటోడ్రైవర్‌ ఆగకుండా వెళ్లిపోవడం.. స్థానికులను షాక్ కు గురిచేసింది.

దీనిపై అక్కడి సూపర్‌వైజర్‌ ఢిల్లేశ్వరరావు, కృష్ణారావు తదితరులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు విషయం తెలియడంతో నరసన్నపేట ఎస్‌ఐ సింహాచలం టోల్‌గేట్‌ వద్ద సీసీ పుటేజీని పరిశీలించారు. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు వస్తున్న పసుపురంగు ఆటోలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో పురుషులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. కరజాడ వద్ద నుంచే వీరు నోట్లు విసురుకుంటూ వస్తున్నట్లు తెలిసింది. టోల్‌గేట్‌ వద్దకు వచ్చే సరికి నోట్ల వర్షం పెరిగింది.

ఈ నోట్లు ఎవరివి, ఆ ఆటో ఎవరిది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ పుటేజీ­లో ఆటో నంబరును గుర్తించారు. ఇవి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోట్లు అనే ప్రచారం జరుగుతోంది. ఒక్క టోల్‌గేటు వద్దే రూ.88 వేలు లభిస్తే.. కరజాడ నుంచి లెక్కిస్తే లక్షల్లో ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి రూ.88 వేలను స్వాధీనం చేసుకున్నామని, సోమవారం తహసీల్దార్‌ కోర్టుకు పంపుతామని, ఎవరైనా క్లెయిమ్‌ చేయడానికి వస్తే ఆధారాలు చూసి విచారిస్తామని ఎస్‌ఐ తెలిపారు.