ఏపీ: 16 డిగ్రీ కాలేజీలకు ఒక్కటే యూనివర్సిటీ.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ: 16 డిగ్రీ కాలేజీలకు ఒక్కటే యూనివర్సిటీ..

July 4, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అన్నిటికి ప్రత్యేకంగా ఓ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 16 డిగ్రీ కళాశాలలకు ఒకే యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తున్నామని, ప్రభుత్వ కళాశాలలన్నీ విశ్వవిద్యాలయ కళాశాలలుగా మారిపోనున్నాయని పేర్కొన్నారు.

ఇందుకు సంబంధించి ఉన్నత విద్యామండలి తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిందన్నారు. ఆ ప్రతిపాదనల్లో.. ‘యూనివర్సిటీ ఏర్పాటు ఎలా చేయాలి? పరిపాలన, పర్యవేక్షణకు పాటించాల్సిన విధానాలను ఏమిటీ? అనే వాటితోపాటు ప్రస్తుతం డిగ్రీ కళాశాలలన్నీ విద్యాశాఖ పర్యవేక్షణలో కొనసాగుతున్నాయని, వాటికి కమిషన్‌గా ఐఏఎస్ అధికారి ఉండగా, మూడు ప్రాంతీయ సంయుక్త సంచాలకుల (ఆర్టేడీ) కార్యాలయాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

అయితే, ఉన్నత విద్యామండలి ప్రతిపాదనల ప్రకారం..”ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే విద్యాశాఖ కమిషనరేట్ రద్దవుతుంది. యూనివర్సిటీ నుంచే నేరుగా పర్యవేక్షణ జరుగుతుంది. డిగ్రీ కళాశాలల యూనివర్సిటీ రాష్ట్రం మొత్తానికి ఒక్కటే ఉంటుంది. పరిపాలన ఇబ్బందులు ఏర్పడ కుండా ఉండేందుకు రాజమహేంద్రవరం, గుంటూరు, కడప జిల్లాల్లో మూడు కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు. అధ్యాపకుల సర్వీసు నిబంధనలు, ఇతరత్రా అంశాలను వీటి నుంచే పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్న అధ్యాపకులను అక్కడి నుంచే యూనివర్సిటీలోకి మార్పు చేస్తారు.”

ఇక, ఈ యూనివర్సిటీ ఏర్పాటుపై అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే, రాష్ట్రస్థాయి పోస్టులుగా మారిస్తే బదిలీల్లో ఇబ్బందులు వస్తాయని ఆవేదన చెందుతున్నారు. ఏకంగా 9,500 మంది అధ్యాపకులు, 1,000 మంది బోధనేతర సిబ్బంది సర్వీసు అంశాలను ఒకే యూనివర్సిటీ ఎలా పర్యవేక్షిస్తుందని ప్రశ్నిస్తున్నారు.