AP: For tenant farmers before August 12..CCRC cards: Jagan
mictv telugu

ఏపీ: ఆగస్టు 12లోపు కౌలు రైతులకు..సీసీఆర్సీకార్డులు: జగన్

July 28, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కౌలు రైతులకు 2022-23 వ్యవసాయ సీజన్‌కు సంబంధించిన సీసీఆర్సీకార్డులను ఆగస్టు 12 లోగా జారీచేసి, ఆ వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, ఖరీలో సాగుచేసే రైతులందరికీ ఎలాంటి తప్పులు లేకుండా ఆగస్టు 31లోగా ఈ-క్రాప్ నమోదు పూర్తి చేయాలని వ్యవసాయాధికారులు, వీఏఏలను వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు.

కౌలు రైతుల సీసీఆర్సీకార్డుల జారీపై, ఈ-క్రాప్ నమోదు ప్రక్రియపై బుధవారం గుంటూరు వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ హరికిరణ్ కార్యాలయం నుంచి ఆయా జిల్లా వ్యవసాయాధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

”వీఆర్వో, వీఏఏల సంయుక్త పర్యవేక్షణలో మాత్రమే ఈ క్రాప్ నమోదు పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక వీఏఏ ప్రతి రోజూ కనీసం 50 ఎకరాలు ఈ-క్రాలో నమోదు చేయాలి. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని పీఎం ఫసల్ బీమా యోజనతో కలిపి పునర్ వ్యవస్థీకరించి అమలు చేసేందుకు ఈ-క్రాప్ నమోదు కీలకం. 2022-23 వ్యవసాయ సీజన్‌లో కౌలు రైతులకు సీసీఆర్సీకార్డులను ఆగస్టు 12 లోగా జారీ చేయాలి. ఆ తర్వాత ఆ వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి” అని ఆయన అన్నారు.