ఆంధ్రప్రదేశ్లో నేడు వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను నాయకులు, కార్యకర్తులు సర్వం సిద్దం చేశారు. విజయవాడ-గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా ఈ ప్లీనరీని సమావేశం జరగనుంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ప్లీనరీ కావడంతో అధికారులు ఏలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులు మొదలుకొని, ఆ పార్టీకి చెందిన వార్డు మెంబర్ల వరకు పార్టీ అధినేత జగన్ పేరుమీద ఆహ్వానాలు వెళ్లాయి. దీంతో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ శ్రేణులు ప్లీనరీకి కదిలి వస్తున్నారు. ప్లీనరీ ప్రాంగణం మొత్తం పార్టీ శ్రేణులతో కిటకిటలాడుతోంది.
అయితే, ఈ ప్లీనరీలో పాల్గొనే సీఎం జగన్ మోహన్ రెడ్డి నుంచి కార్యకర్త వరకు ఒకే మెనూ ప్రకారం టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ అందించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వాటిని తయారు చేయడానికి అవసరమైన వంట సామగ్రి, కూరగాయలు, సరుకులను భారీ ఎత్తున సిద్ధం చేశారు. రకరకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలను వంటవాళ్లు తయారు చేస్తున్నారు. వంటవాళ్లను ద్రాక్షారామం, ఇందుపల్లి ప్రాంతాల నుంచి రప్పించారు. ఈ రోజు, రేపు ఉదయం టిఫిన్లుగా ఇడ్లీ, పొంగల్, ఉప్మా, మైసూర్ బజ్జీలను అందించనున్నారు. నోరూరించే 25 రకాల వంటకాలతో భోజనాలను సిద్దం చేస్తున్నారు..