పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. మూడు స్థానాల్లో ఘన విజయం సాధించింది. శుక్రవారమే రెండు రెండు ఫలితాలు ఖరారు కాగా, శనివారం పశ్చిమ రాయలసీమ స్థానాన్ని కూడా టీడీపీ దక్కించుకుంది. చివరివరకు హోరాహోరీగా సాగిన ఈ ఫలితంలో వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డిపై 7543 ఓట్ల మెజారీటీతో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామభూపాలరెడ్డి గెలుపొందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక ఎమ్మెల్సీ ఫలితాలపై టీడీపీ వైసీపీ మధ్య యుద్ధం మొదైంది. ఈ ఫలితాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ పెద్దలు అంటే..రాష్ట్రంలో మార్పు మొదలైందని టీడీపీ చెబుతోంది. ఇదే క్రమంలో ఎమ్మెల్యే , హీరో బాలకృష్ణ..సీఎం జగన్ కు అదరిపోయే కౌంటర్ ఇచ్చారు. గతంలో 175 సీట్లకు175 సీట్లు గెలుస్తామని జగన్ చెప్పిన మాటలను గుర్తుచేస్తూ వై నాట్ 175 అని జగన్ ఇప్పుడంటే వినాలని ఉందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని తొక్కిపట్టి నార తీశారని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. పులివెందుల కోటకు బీటలు పడుతున్నాయని, త్వరలో ఆ బీటలు తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరతాయని అన్నారు. గెలిచిన టీడీపీ అభ్యర్థులకు అభినందనలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు అభినందనలు తెలిపారు.
పశ్చిమ రాయలసీమ ఫలితం నేడు విడుదల కాగా..మార్చి 17నే ఉత్తరాంధ్ర ,తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రెండింట్లో టీడీపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు రెండో ప్రాధాన్య ఓటుతో విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం కనబరిచిన చిరంజీవి రావు.. వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డిపై 34వేల 110 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.