ఏపీ: నిరుద్యోగులకు శుభవార్త.. ఆగస్టులో గ్రూప్‌–1,2.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ: నిరుద్యోగులకు శుభవార్త.. ఆగస్టులో గ్రూప్‌–1,2..

July 6, 2022

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు జగన్ సర్కార్ ఆగస్టు నెలలో శుభవార్తను చెప్పనుంది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌ పి.గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ..” ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నెల ( ఆగస్టు)లో గ్రూప్‌–1, గ్రూప్, 2 నోటిఫికేషన్లు వెలవడనున్నాయి. 110 గ్రూప్‌–1 పోస్టులు, 182 గ్రూప్‌–2 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేస్తాం. ఇప్పటికే వివిధ ఉద్యోగాల భర్తీకి 16 నోటిఫికేషన్లు విడుదల చేశాం. వాటిలో మూడింటిని పూర్తి చేశాం. ఇంకా 13 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు, ఇతర ప్రక్రియలను ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో పూర్తి చేస్తాం. 2 వేల వరకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తాం” అని ఆయన అన్నారు.

ఇదివరకే విడుదలైన 670 జూనియర్‌ అసిస్టెంట్, 119 ఏఈ పోస్టులకు ఈ నెలాఖరున పరీక్షలు ఉంటాయని ఆయన అన్నారు. ఈ పోస్టులకు 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారని, ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక విషయంలో ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా కమిషన్‌ ముందుకు వెళ్తుందన్నారు.

ఇక, ఆగస్టులో రాబోయే గ్రూప్‌–1 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నామని, తుది నిర్ణయమేదీ లేదని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా ఇచ్చారు. అత్యున్నత పోస్టులకు ఎంపికైన వారికి అందుకు తగ్గ సామర్థ్యాలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలంటే, రాత పరీక్షలతో పాటు ఇతర రకాల పరీక్షలు కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోందన్నారు. యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాల కమిషన్లతో దీనిపై చర్చిస్తున్నామని తెలిపారు. కేరళలో ఇంతకుముందు జరిగిన వివిధ రాష్ట్రాల కమిషన్ల భేటీలో దీనిపై చర్చ జరిగిందని, వచ్చే నెల 8న విశాఖపట్నంలో ఆలిండియా కమిషన్ల సమావేశం ఉంటుందని అందులోనూ చర్చిస్తామని ఆయన తెలిపారు.