AP: Good news..proposals for filling 240 posts..in this department
mictv telugu

ఏపీ: గుడ్‌న్యూస్..240 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు..ఈ శాఖలోనే

September 4, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 240 లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించి, విద్యా కమిషనర్‌ పోలా భాస్కరరావు నిరుద్యోగ యవతకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 240 లెక్చరర్‌ ఉద్యోగాలను గుర్తించి, వాటిని వెంటనే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ)కి ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు.

పోలా భాస్కరావు మీడియాతో ఆయన మాట్లాడుతూ..”రాష్ట్రవ్యాప్తంగా 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయి. అందులో రూ.391 కోట్లతో 27 కళాశాలలకు కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఒక్కో కళాశాలకు త్వలోనే రూ.14.5 కోట్ల చొప్పున మంజూరు కానున్నాయి. 124 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాడు–నేడు కింద భవనాల ఆధునికీకరణకు రూ.271 కోట్లు విడుదల కావాల్సి ఉంది. కొత్తగా వస్తున్న ఆరు డిగ్రీ కళాశాలల్లో ఒక్కో దానిలో 24 మంది అధ్యాపకులు, మరో 10 ఇతర పోస్టులు మంజూరు చేయాల్సి ఉంది. ఆరు కళాశాలల్లో అదనపు భవనాల నిర్మాణానికి రూ.1.67 కోట్లు కేటాయించాం” అని ఆయన అన్నారు.

ఇక, డిగ్రీ కోర్సుల విషయానికొస్తే.. విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పలు కోర్సులను జోడించామని భాస్కరరావు తెలిపారు. డిగ్రీలో ప్రతి సెమిస్టర్‌లో 8 వారాలపాటు ఇంటర్న్‌షిప్‌ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయా డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరు నమోదుకు ప్రయోగాత్మకంగా ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.