AP government approached the Supreme Court against the three capitals
mictv telugu

మూడు రాజధానులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన జగన్ ప్రభుత్వం

September 17, 2022

మూడు రాజధానుల అంశంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే రాజధాని అంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని… ప్రభుత్వ నిర్ణయాన్ని ఆపేయాలనుకోవడం శాసన వ్యవస్థ అధికారాలను ప్రశ్నించడమే అవుతుందని సుప్రీంకోర్టుకు తెలిపింది. సీఆర్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వ వ్యవహరించాలని, నెల రోజుల్లో అమరావతిలో అన్ని సదుపాయాలను కల్పించాలని హైకోర్టు ఆదేశించడం సరికాదని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని పిటిషన్ లో తెలిపింది.

రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉన్నత న్యాయస్థానం తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని చెప్పడం శాసనసభను అగౌరవపరచడమేనని చెప్పింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని.. ఈ అంశంలో వెంటనే స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరోవైపు అమరావతి రైతుల మహాపాదయాత్ర నేడు ఆరో రోజుకు చేరుకుంది. ఇవాళ బాపట్ల జిల్లా ఐలవరం నుంచి రాజధాని రైతుల పాదయాత్ర ఉత్సాహంగా ప్రారంభమైంది. ఏకైక రాజధాని సంకల్పంతో.. రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్ర కొనసాగుతోంది.