ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టిపెట్టారు. నాడు–నేడు, ఇంగ్లీషు మీడియం, ద్విభాషలతో కూడిన పాఠ్యపుస్తకాలు, విద్యాకానుక, అమ్మ ఒడి, గోరుముద్దలాంటి కార్యక్రమాలతో విద్యారంగంలో అభివృద్ధి వైపు అడుగులు వేసిన జగన్ సర్కారు తాజాగా మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయంగా ప్రస్దిద్ధి చెందిన సుప్రసిద్ధ ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ ‘బైజూస్’తో (BYJU’S) ఒప్పందం కుదుర్చుకుంది.
సీఎం సమక్షంలో కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్.సురేష్‌కుమార్, బైజూస్ వైస్ ప్రెసిడెంట్, పబ్లిక్‌పాలసీ హెడ్ సుస్మిత్ సర్కార్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. బైజూస్‌తో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ ఒప్పందంతో ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి వరకు ఎడ్యు-టెక్ విద్యను అందించనున్నట్లు చెప్పారు.
బైజూస్ ద్వారా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాల రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. వీటితో విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో సమగ్రంగా నేర్చుకునేందుకు వీలుంటుందన్నారు. మరోవైపు ఏటా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఈ సెప్టెంబరులోనే విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తామని వివరించారు. వీడియో కంటెంట్ ద్వారా పాఠ్యాంశాలను అర్థం చేసుకునేలా తరగతి గదిలో టీవీలూ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.