టాలీవుడ్ నటులకు వరుసగా పదవులు ఇస్తూ వచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో నటుడు జోగి నాయుడుకి కీలక పదవిని కట్టబెట్టింది. ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. రజత్ భార్గవ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోసాని కృష్ణమురళి, హాస్యనటుడు అలీ సరసన చేరారు జోగినాయుడు. పోసానిని గతేడాది ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా, అలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించడం తెలిసిందే. కాగా, 1998లో జెమినీ టీవీలో వచ్చిన జోగి బ్రదర్స్ అనే కార్యక్రమంలో ఉత్తరాంధ్ర యాసతో జోగినాయుడు పాపులర్ అయ్యారు. తర్వాత డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చి టీవీ రంగంలో ప్రవేశించారు. ఈ క్రమంలో కొద్దిరోజులు స్టార్ దర్శకులు పూరీ జగన్నాథ్, కృష్ణవంశీల దగ్గర పని చేశారు. అనంతరం సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు వేసుకొని తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు.