ఏపీలో టీడీపీ రోడ్ షో, మీటింగ్ల కారణంగా వారం రోజుల వ్యవధిలో మొత్తం 11 మంది అమాయకులు మరణించిన సంగతి తెలిసిందే. కందుకూరులో జరిగిన టీడీపీ రోడ్ షో, గుంటూరులో జరిగిన చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమాల్లో జరిగిన తొక్కిసలాటల్లో సామాన్య ప్రజలు మరణించడంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై రోడ్లపై సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్లపై ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. అత్యంత అరుదైన సందర్భాల్లో ఎస్పీ, పోలీస్ కమిషనర్ అనుమతితో సభలు సమావేశాలు పెట్టుకోవచ్చని సూచించింది.
1861 పోలీస్ చట్టం ప్రకారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై ర్యాలీలు, బహిరంగ సభలు కారణంగా ప్రజలు ఇబ్బంది పడటమే కాకుండా నిర్వహణ లోపాలతో అమాయక ప్రజలు బలవుతున్నారని అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులు పూర్తిగా ప్రజల రాకపోకలు, సరుకు రవాణా కోసమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సభల నిర్వహణకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని ప్రభుత్వం జిల్లాల ఉన్నతాధికారులకు సూచించింది. రహదారులకు దూరంగా, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సరైన ప్రదేశాలను ఎంపిక చేయాలని పేర్కొంది. వివిధ పార్టీలు, ఇతర సంస్థలు సభలను ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించుకోవచ్చని చెప్పింది.