గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎగువ కాఫర్ డ్యామ్‌ను పటిష్ఠపరచడంతో పాటు ఎత్తు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు యుద్ధ ప్రాతిపదికన ఎగువ కాఫర్ డ్యామ్‌ను మరో మీటరు మేర ఎత్తు పెంచేందుకు పనులు చేపట్టారు. మీటరు ఎత్తు, రెండు మీటర్ల వెడల్పున మట్టిని, ఇసుక బస్తాలను వేసి గట్టిపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యామ్ 42.5 మీటర్ల ఎత్తున నిర్మించారు. ముందస్తు చర్యల్లో భాగంగా మీటరు మేర ఎత్తు, రెండు మీటర్ల వెడల్పున మట్టి, ఇసుకతో పటిష్ఠ పరచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యామ్, స్పిల్ వే వద్ద 20.37 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. రేపటికి 28 లక్షల క్యూసెక్కుల వరకూ వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఏపీ జలవనరుల శాఖ ఈ పనులు చేపట్టింది.