కరోనా ఉంది, ఎన్నికలు వద్దు.. జగన్ కొత్త మెలిక  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఉంది, ఎన్నికలు వద్దు.. జగన్ కొత్త మెలిక 

October 23, 2020

AP GOVT. CLARIFIES ON LOCAL BODY ELECTIONS, SAYS IT IS NOT POSSIBLE TO HOLD POLLS IN NOVEMBER.jp

ఏపీలో జరగనున్న స్థానిక ఎన్నికలపై జగన్ ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. కరోనా పరిస్థితుల కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నవంబర్‌లో నిర్వహించే పరిస్థితి లేదని జగన్ సర్కార్‌ స్పష్టంచేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై ఈ నెల 28న రాష్ట్రంలోని అన్నీ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇంతలో జగన్ ప్రభుత్వం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తాడేపల్లిలో స్టేట్ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా తీవ్రత కొంత తగ్గినట్లు కనిపిస్తున్నా మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నారని అన్నారు. 

నవంబర్‌ నెలలో మరిన్ని పాజిటివ్ కేసులు పెరగొచ్చని తెలిపారు. ‘బిహార్ వంటి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు తప్పనిసరి. మన వద్ద జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కొంత వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు’ అని చెప్పారు. దీంతో ఎన్నికలు నిర్వహించాలన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రయత్నాలు విఫలం అయినట్టుగానే కనిపిస్తున్నాయి. కాగా, గతంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా ఉన్న సమయంలో కరోనా వ్యాప్తి చెందుతుందని స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్ సర్కార్ ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి ఆయన్ను పదవి నుంచి తొలగించింది. అనంతరం నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది.