ఏపీలోని వైసీపీ ప్రభుత్వం పొదుపు చర్యల్లో భాగంగా ఓ విమర్శనాత్మక నిర్ణయం తీసుకుంది. ఉగాది సందర్భంగా విధి నిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి ఇచ్చే శౌర్య పతకాల నగదు ప్రోత్సాహకాన్ని తగ్గించింది. ఇంతకు ముందు ప్రతీనెలా రూ. 500 ఉండగా, రూ. 350 తగ్గిస్తూ రూ. 150కి పరిమితం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ నుంచి శౌర్య పతకాలు సాధించిన వారికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాటిని చూసిన పతకధారులు ఖంగుతింటున్నారు. ఈ కాలంలో రూ. 500 అంటే ఏ మూలకు సరిపోవని, కానీ, గుర్తింపు కోసం ఇస్తున్నారు కాబట్టి గౌరవంగా, గర్వంగా ఫీలయ్యే వాళ్లమని వారు భావించారు. కానీ, మరీ రూ. 150 ఇవ్వడం తమను అవమానించడమే కాక, సీఎం స్థాయి తగ్గించుకున్నట్టయిందని పలువురు వాపోతున్నారు. నేటి ద్రవ్యోల్బణానికి తగ్గట్టు సదరు మొత్తాన్ని పెంచాల్సింది పోయి మరీ దారుణంగా తగ్గిస్తారా? అంటూ కొందరు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. వేరే పథకాలకు కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం సిన్సియర్‌గా డ్యూటీ చేసే వారి పట్ల తీసుకున్న చర్య ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.