ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్య్లూఎస్ వర్గాలకు చెందిన ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల వయోపరిమితి సడలించిన తరహాలోనే.. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కూడా వయోపరిమితి సడలించింది జగన్ ప్రభుత్వం. ఈ మేరకు సబార్డినేట్స్ సర్వీస్ రూల్స్‌ను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇకపై డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 39 ఏళ్లు. ఇంతకముందు ఈడబ్య్లూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాలుగా ఉండేది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఈడబ్య్లూఎస్ వర్గాలలో హర్షం వ్యక్తమవుతోంది.
కాగా ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ కోసం ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ 2018ను సవరిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్ కింద కొత్తశాఖను ఏర్పాటుచేసి దాని కింద పలు విభాగాలను రూపొందించింది. ఈ శాఖను ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్‌లో రెండో షెడ్యూల్‌లో హౌసింగ్ డిపార్ట్‌మెంట్ తర్వాత ఐదో విభాగంలోని వెల్ఫేర్ సెక్టార్ కింద చేరుస్తూ ఆ మేరకు బిజినెస్ రూల్స్‌ను సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.