ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పథకాలకు తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు లేదా తన పేరును పెట్టడం రివాజుగా పెట్టుకున్నారు. నవరత్నాల పేరుతో అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఇప్పటికే తన పేరు పెట్టుకోగా, తాజాగా గుడ్లపై తన తండ్రి పేరును స్టాంపులు వేస్తుంది అక్కడి ప్రభుత్వం. రాష్ట్రంలో బాలింతలు, అంగన్ వాడీల్లోని చిన్న పిల్లలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు ప్రభుత్వం పౌష్టికాహారం నిమిత్తం గుడ్లను సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ గుడ్లు దుర్వినియోగం కాకుండా ఏపీ ప్రభుత్వం వాటిపై వైఎస్సార్ ఎస్పీ పేరును ముద్రించింది.
బాపట్ల జిల్లా చీరాల, వేటపాలెం మండలాల్లో ఈ గుడ్లు దర్శనమిచ్చాయి. మార్కెట్లో దొరికే వాటికి, ఈ గుడ్లకు తేడా తెలియడానికి ఈ విధంగా స్టాంపు వేసినట్టు తెలుస్తోంది. ఎస్పీ అంటే సంపూర్ణ పోషణ అని అర్థమంట. వైఎస్సార్ పేరును లబ్దిదారులు గుడ్లు తింటున్నప్పుడల్లా గుర్తుంచుకోవాలని ఈ చర్యకు పాల్పడినట్టు ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. కొందరు మాత్రం చివరికి కోడిగుడ్లను కూడా స్వలాభానికి వాడుకుంటున్నారు.. ఇది మరీ అరాచకం అని ఫీలవుతున్నారు. అయితే గుడ్లు బ్లాక్ మార్కెట్లోకి వెళ్లకుండా అరికట్టడానికే ఈ ముద్రలు వేశారని వైకాపా శ్రేణులు అంటున్నాయి.