బాపూరే ఈ విందులేంటీ..ఈ ఖర్చులేంటీ..! - MicTv.in - Telugu News
mictv telugu

బాపూరే ఈ విందులేంటీ..ఈ ఖర్చులేంటీ..!

June 29, 2017

బాబు సర్కార్ భలే రిచ్ గురూ..అరెరే అందరూ అప్పుల్లో ఉందంటారు. మరి రిచ్ ఎట్ల అనుకుంటున్నారా. అమ్మతోడు నిప్పులాంటి నిజం. నమ్మితీరాల్సిందే. లేకపోతే బాబుని అవమానించినట్టే. ఏపీ ని మరో సింగపూర్ చేస్తా..జపాన్ లా మారుస్తా అంటే.. ఎహె బాబు కోతలు అనుకున్నాం.. కానీ నిజంగానే పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టినట్టు అప్పుడే అమరావతిని సింగపూర్ చేసేశారు. ఇంతకీ ఎందులో సింగపూర్ చేశారంటే…?

ఏ స్టార్ హోటల్లో ఎంత ఖరీదైన ఫుడ్.. వంద రకాల కూరలు..స్వీట్లు..వెజ్ అయినా నాన్ వెజ్ అయినా తిన్నారంటే మహా అంటే ఒక్కొక్కరికి పదివేలు…ఎక్కువలో ఎక్కువ 20 వేలు.. అమెరికా, ఫ్రాన్స్ ,జర్మనీ, జపాన్ , సింగపూర్ లోనైనా 50 వేలు మించదేమో.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇలాకాలో మాత్రం ఇంతకు డబుల్ అయింది. విందు ఖర్చులు వింటే దిమ్మతిరిగిపోవాల్సిందే. 19మంది డిన్నర్ కి 19లక్షలు అయింది. అంటే ఒక్కొక్కరి లక్ష రూపాయల డిన్నర్ అయింది. వీళ్లు అన్నమే తిన్నారా…బంగారం మింగేశారా…? ఒక్కరోజు గెస్ట్ ల డిన్నర్ కే ఇంత ఖర్చు పెడితే…ఏడాదిలో ఎంతమంది ప్రముఖులు వచ్చారు. ఎన్ని లక్షలు వారి కడుపుల్లో పోశారు. ఓరి నాయనా ఈ లెక్కన బాబు సర్కార్ అతిథుల కోసం కోట్లే గుమ్మరించదన్న మాట.మిగతా విషయాల్లో ఏమోగానీ ఇందులో సింగపూరే కాదు దాన్ని బాపుని మించిపోయింది.

ఇదేదో ప్రతిపక్ష నేత జగన్ చేసిన ఆరోపణ కాదు. గాలి లెక్కలు అంతకన్నా కావు..ఈవివరాల్ని ఒక సామాజిక కార్యకర్త ..ఆర్టీఐ చట్టం ద్వారా శోధించి సాధించిన అక్షర సత్యం. 19మంది డిన్నర్ కి 19లక్షలు ఖర్చు చేశారు…ఇదిగో వచ్చిన అతిథుల లిస్టు, పెట్టిన ఖర్చు మీరే చూడండి.

ఈ ఏడాది ఫిబ్రవరి 23,24 తేదీల్లో ఏపీ ప్రభుత్వం విజయవాడలో “ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, కమర్షియల్ అండ్ ఎమర్జింగ్ లాస్” అనే అంశంపై రెండురోజుల పాటు అంతర్జాతీయ వర్క్ షాప్ నిర్వహించింది. ఈ సమావేశానికి పలువురు ప్రముఖలు హాజరయ్యారు. ఆ తర్వాత వీరికోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో పాల్గొన్నది కేవలం 19మంది మాత్రమే. ఇందుకోసం ప్రభుత్వం రూ.13,38,720 ఖర్చు చేసింది. మరో రూ.4,90,705 లను వారి సదుపాయల నిర్వహణకు ఖర్చు చేసింది. మొత్తం 18,29,425 రూపాయలను ఏపీ ప్రభుత్వం వినియోగించింది.

ఏపీ అప్పుల్లో ఉన్నా సరే చంద్రబాబు నాయుడు వెనకాడలేదు. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. బాబు గారు మీరు చాలా గ్రేట్. గిన్నిస్ రికార్డ్ అవుతుందేమో…గిన్నిస్ బుక్కోళ్లకు పంపించండి. ప్రపంచం అంతా తెలిసిపోతుంది. ఏపీ సర్కార్ కు మంచి పేరు వస్తుంది. మీ అతిథ్యం కోసం ఇన్వెస్టర్స్ క్యూ కడతారు. ప్రపంచ ఏడు వింతలతో పాటు అమరావతి అతిథ్యం ఎనిమిదో వింత అవుతోంది. జర ఆలోచించండి బాబు…