గాడిద పాలతో రూ.కోట్ల ఆదాయం.. సత్తా చాటుతున్న తెలుగోడు - MicTv.in - Telugu News
mictv telugu

గాడిద పాలతో రూ.కోట్ల ఆదాయం.. సత్తా చాటుతున్న తెలుగోడు

May 18, 2022

డిగ్రీ చదివిన ఓ యువకుడు.. మిగతా వారి లాగా పై చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెతుకుతూ సమయం వృథా చేయలేదు. గాడిదల ఫామ్ పెట్టి వాటి పాలను అమ్మడం ద్వారా ఏడాదికి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. తమిళనాడు తిరునెల్వేలి జిల్లా తులుకపట్టి గ్రామంలో నెలకొల్పిన గాడిదల ఫామ్‌కు జిల్లా కలెక్టరే ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్రంలో ఈ ఫామ్ నెలకొల్పారంటే ఆ యువకుడెవరో తమిళ వ్యక్తి అనుకునేరు. ఆ యువకుడు మన తెలుగోడే. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన బాబు.. ‘ద డాంకీ ప్యాలెస్’ ఫామ్కు యజమాని. అతడు వంద గాడిదలతో ఈ వ్యాపారం మొదలుపెట్టాడు. మొదట మామూలుగా ప్రారంభించిన ఈ వ్యాపారం అతనికి అన్ని రకాల కలిసొచ్చింది. దీంతో వాటి కోసం సకల సదుపాయాలు కల్పించి, ఈ నెల 14 న కలెక్టర్ చేతులు మీదుగా ప్రారంభోత్సవం జరిపాడు.

దేశంలో గాడిదల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతుండగా.. వాటి పాలకు మాత్రం డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. గాడిద పాలలో ఔషధ గుణాలు, పోషకాలు మెండుగా ఉండటంతో వాటిని పలు సౌందర్య ఉత్పత్తుల తయారీలో విక్రయిస్తారు. దీన్నే తన వ్యాపారంగా మలుచుకున్న బాబు.. పాలు తీసి, ప్రాసెస్ చేసి, నిల్వ చేస్తాడు. వాటిని బెంగుళూరులోని సబ్బులు, కాస్మోటిక్ రంగ సంస్థలకు సరఫరా చేస్తాడు. బయట మార్కెట్లో లీటరు గాడిద పాల ధర రూ.7వేల వరకు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం భారత్లో లక్షా 40 వేల గాడిదలు ఉన్నాయి. తమిళనాడులో వాటి సంఖ్య 428 మాత్రమే.