ఆంధ్రప్రదేశ్లో 2018 నాటి గ్రూప్ 1 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్సైటులో పొందుపర్చారు. ఈ మేరకు సంస్థ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మీడియాకు విజయవాడలో వెల్లడించారు. మొత్తం 167 పోస్టులు ఉండగా, ఎంపికైన వారిలో 67 మంది మహిళలు, 96 మంది పురుషులు ఉన్నారు.
నాలుగు పోస్టులను వివిధ కారణాలతో భర్తీ చేయలేదని సవాంగ్ పేర్కొన్నారు. టాపర్గా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన రాణి సుస్మిత, రెండో స్థానంలో వైఎస్సార్ జిల్లా కోతుల గుట్టపల్లికి చెందిన శ్రీనివాస రాజు, మూడో స్థానంలో హైదరాబాదుకు చెందిన సంజన సింహ ఉన్నారు. ఈ సందర్భంగా సవాంగ్ మాట్లాడుతూ..‘హైకోర్టు ఆదేశాలతో నాలుగేళ్లుగా జరుగుతున్న ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను విడుదల చేశాం. వచ్చే నెలలో 110 పోస్టులతో గ్రూప్ 1, 182 పోస్టులతో గ్రూపు 2 నోటిఫికేషన్లు విడుదల చేస్తాం. డిజిటల్ వాల్యూయేషన్పై కోర్టులో విచారణ జరిగింది. భవిష్యత్తులో టెక్నాలజీ వినియోగంతో మంచి ఫలితాలు వస్తాయ’ని వివరించారు.