బిగ్‌బాస్ ‌షోపై ఏపీ హైకోర్టు ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్‌బాస్ ‌షోపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

April 30, 2022

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్ షో అంటే తెలియని వారుండరు. ఈ షో తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ప్రసారమవుతుంది. మొదట్లో ఈ షోను కొంతమంది తీవ్రంగా విమర్శిస్తే, మరొకొంతమంది మెచ్చుకున్నారు. ఈ షోపై 2018వ సంవత్సరంలో తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఈ బిగ్‌బాస్ షోను వెంటనే నిలిపివేయాలని హైకోర్టును వేడుకున్నారు. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ టి.రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

అనంతరం ఈ షోకు సంబంధించిన తుది తీర్పును సోమవారం వెల్లడిస్తామని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పిటిషనర్ తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి ఈ షోపై అత్యవసర విచారణ జరపాలని ధర్మాసనాన్ని కోరారు. దానికి ధర్మాసనం స్పందిస్తూ..”మంచి పిటిషన్ వేశారు. ఈ రియాల్టీ షోలతో యువత చెడిపోతున్నారు. ఇలాంటి షోలు సమాజానికి ప్రమాదకరం. సమాజంతో మాకేమి సంబంధం లేదు అనే విధంగా ఉంటే ఎలా? అభ్యంతరకర షోల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది” అని తెలిపింది.

ఇన్ని రోజులు ఎవరూ ఎందుకు స్పందించలేదని అనుకుంటున్నామని, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అశ్లీలతను పెంచుతున్నాయి అని వ్యాఖ్యానించింది. 2019లో పిటిషన్ చేస్తే ఇప్పటిదాకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదా? అని న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ తర్వాత సోమవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సోమవారం రోజున బిగ్ బాస్ షోకు హైకోర్టులో కచ్చితంగా షాక్ తగులుతుందని, త్వరలోనే ఈ షో రద్దు చేయబడుతుందని బిగ్ బాస్ ప్రియులు చర్చించుకుంటున్నారు.