బిగ్‌బాస్ షోపై ఏపీ హైకోర్ట్ ఆగ్రహం.. కళ్లుమూసుకుని ఉండలేం - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్‌బాస్ షోపై ఏపీ హైకోర్ట్ ఆగ్రహం.. కళ్లుమూసుకుని ఉండలేం

May 3, 2022

ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’పై ఏపీ హైకోర్ట్ తీవ్రంగా మండిపడ్డింది. షో పేరుతో ఏదిపడితే అది చూపిస్తాము అంటే, తాము కళ్లు మూసుకుని ఉండలేమని స్పష్టం చేసింది. గతంలో తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి బిగ్‌బాస్‌ షో అసభ్యంగా, అశ్లీలంగా ఉందంటూ, వెంటనే షోను రద్దు చేయాలని పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై గతవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. సోమవారం రోజు తుది తీర్పు వెలువరిస్తామని వాయిదా వేసింది. ఈ క్రమంలో జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి, పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

”రియాలిటీ షో అనే పేరుతో ఏది పడితే అది చూపిస్తామంటే కుదరదు. అలా చూపిస్తాము అంటే కోర్టు కళ్లు మూసుకుని ఉండదు. షోలో హింసను ప్రోత్సహిస్తూ సంస్కృతి అని ఎలా అంటారు. పిటిషనర్ సరైన కారణంతోనే పిల్ వేశారు” అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తచేసింది. అనంతరంఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ అవసరమని భావిస్తే, ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌ ఎదుట అభ్యర్థించేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు కల్పిస్తామని చెప్పి.. విచారణ నుంచి తొలగించింది.

మరోపక్క బిగ్‌బాస్ షో అంటే అదొక వ్యభిచార గృహామని సీపీఐ నారాయణ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ షో వల్ల యువత చెడిపోతున్నారని, ఇలాంటి షోలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కొంతమంది తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. మరికొంతమంది యువత ఈ షో వల్ల ఓ గంటసేపు వినోదం దొరుకుతుందని, ఇందులో తప్పేముందని వారి వారి అభిప్రాయాలను తెలిపారు. ఈ క్రమంలో ఏపీ హైకోర్ట్ బిగ్‌బాస్‌ షోపై తీవ్రంగా ఆగ్రహిస్తూ, విచారణను తొలగించడం సంచలనంగా మారింది.