ఇళ్ల పట్టాల వ్యవహారంపై  ఏపీ హైకోర్టు ఆగ్రహం  - MicTv.in - Telugu News
mictv telugu

ఇళ్ల పట్టాల వ్యవహారంపై  ఏపీ హైకోర్టు ఆగ్రహం 

July 16, 2020

AP High Court angry over House-site allotmen

ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోమారు ఆగ్రహం వ్యక్తంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలకోసం భూసేకరణ చేస్తున్న తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇప్పటికే నిర్మించిన గృహాలను ఎందుకు పంపిణి చేయలేదని.. ఆ ఇళ్లకు కనీసం విద్యుత్ కనెక్షన్ కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. అవన్నీ వదిలేసి ఇళ్ల స్థలాల పంపిణి  అవసరమా అని నిలదీసింది.  చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన రెండు పిటిషన్ల విచారణ సందర్బంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తమ భూముల్ని అక్రమంగా తీసుకుంటున్నారంటూ అనేకమంది ఆశ్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం పశువుల మేతకోసం కేటాయించిన భూములను, చెరువులు, కుంటలు నదుల తీరా ప్రాంతాన్ని ఇతర అవసరానికి ఉపయోగించరాదని తేల్చి చెప్పింది. ఈ ఆర్డర్స్‌కు విరుద్ధంగా ఎలా జీవో జారీ చేశారని.. ఇళ్ల స్థలాల పంపిణి పేరుతో అధికారుల తీరు ఏమాత్రం సరికాదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు భూముల సేకరణకు ఎలాంటి విధానం అమలు చేస్తున్నారో చెప్పాలంది.  అవసరమైతే సింగల్ జడ్జి వద్ద అన్ని పిటిషన్లను ధర్మాసనం ముందుకు తెప్పించుకొని విచారణ చేపడతామని చెప్పింది. కాగా, ఇప్పటికే చాలా సార్లు ఈ పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా జులై 8న జరగాల్సిన కార్యక్రమం వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ తీవ్రత తగ్గకపోవడంతో నిలిపివేయక తప్పడం లేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుండగా హైకోర్టు ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది.