AP High Court has fined 14 petitioners of ippatam villiage
mictv telugu

ఇప్పటం పిటిషనర్లకి హైకోర్టు షాక్.. ఒక్కొక్కరికి లక్ష జరిమానా

November 24, 2022

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటంలో అక్రమ నిర్మాణ తొలగింపుపై హైకోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు కోర్టు షాకిచ్చింది. తప్పుడు సమాచారం ఇచ్చి స్టే తెచ్చుకున్నందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది ఒక్కొక్క పిటిషనర్ కి రూ. 1 లక్ష జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. కూల్చివేతలపై నోటీసులు ఇచ్చినా సరే ఇవ్వలేదని అబద్దం చెప్పినందుకు మండిపడింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని స్పష్టం చేసింది. ఇదంతా న్యాయస్థాన ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని వ్యాఖ్యానించింది. నిర్మాణాల తొలగింపుపై స్టే పొడగించలేదు.

అంతకు ముందు ఇళ్ల నిర్మాణాల తొలగింపుపై అధికారులు తమకు ముందుగా నోటీసులు ఇచ్చారని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టులో ఒప్పుకున్నారు. కోర్టుకు హాజరైన 14 మంది పిటిషనర్లు కూడా తమకు దీనిపై అవగాహన లేదని చెప్తున్నా.. కోర్టు పట్టించుకోకుండా జరిమానా విధిస్తూ మళ్లీ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా, నిర్మాణాల తొలగింపుపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసాయి. ముందుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటంలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం ఇళ్లు కోల్పోయిన బాధితులకు పార్టీ తరపున రూ. 1 లక్ష అందిస్తానని ప్రకటించారు. అందుకోసం మరోసారి ఇప్పటం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ లోపే కోర్టు తీర్పు ఇలా రావడంతో ఏం జరుగుతుందనే ఆసక్తి నెలకొంది.

 

ఇది కూడా చదవండి : ఏపీలో కొత్త పార్టీ పెడతాం.. పీఠాధిపతుల వార్నింగ్