AP High Court has stayed the demolition of houses in ippatam village
mictv telugu

బ్రేకింగ్.. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు

November 4, 2022

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో సీఆర్డీయే అధికారులు శుక్రవారం ఇళ్ల కూల్చివేతలకు దిగిన విషయం తెలిసిందే. రోడ్డు విస్తరణ కోసం ఇప్పటికే నోటీసులు ఇచ్చిన అధికారులు కూల్చివేతలు చేపట్టడంతో స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించారు. అయినా ఆగని అధికారులు పోలీసుల సహాయంతో కార్యక్రమాన్ని కొనసాగించారు. దీంతో ఈ విషయంపై జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అత్యవసర విచారణ జరిపిన కోర్టు.. కూల్చివేతలు ఆపాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. దీంతో అధికారులు అక్కడ నుంచి వెనుదిరిగారు.

గ్రామంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొంత శాంతించాయి. కాగా, జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామ ప్రజలు స్థలం ఇచ్చారు. అందులోనే పవన్ కల్యాణ్ తన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థలం ఇచ్చినందుకు గ్రామ ప్రజలకు పవన్.. రూ. 50 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించగా, ఈ మొత్తం తమకు జమ చేయాలంటూ సీఆర్డీఏ అధికారులు వింత డిమాండ్ చేశారు. దీనికి గ్రామ ప్రజలు, జనసేన ససేమిరా ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో గ్రామంలో 70 అడుగులు ఉన్న రోడ్డును 120 అడుగులకు విస్తరిస్తామంటూ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా కూల్చివేతలు ప్రారంభించారు. కాగా, శనివారం పవన్ కల్యాణ్ ఇప్పటంలో పర్యటిస్తారని విశ్వసనీయ సమాచారం.