ధరల నిర్ణయంపై ఏపీ హైకోర్ట్ సీరియస్..   - MicTv.in - Telugu News
mictv telugu

ధరల నిర్ణయంపై ఏపీ హైకోర్ట్ సీరియస్..  

April 21, 2022

06

ఏపీ హైకోర్ట్ మరోసారి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహించింది. సినిమా టికెట్ ధరలను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, లైసెన్సింగ్ అథార్టీకి తమ అభిప్రాయాన్ని తెలియజేయడమే తప్పా, ధరలను నిర్ణయించేది లైసెన్సింగ్ అథార్టీయేనని స్పష్టం చేసింది. గత జీవోల ప్రకారం లైసెన్సింగ్ అధార్టీ టికెట్ ధరలను నిర్ణయిస్తుందని గుర్తు చేసింది.

ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బుధవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. ఆ ఉత్తర్వులప్రకారం..”ఆన్లైన్‌లో సినిమా టికెట్లు విక్రయించేటప్పుడు సర్వీసు ఛార్జీలను టికెట్ ధరల్లో కలపడానికి వీల్లేదు. పాత విధానంలో టికెట్లను విక్రయించుకోవచ్చు. ఆన్‌లైన్లో టికెట్లు బుక్ చేసుకునే ప్రేక్షకులకు సర్వీసు ఛార్జీలు విధించుకునే వెసులుబాటును యాజమాన్యాలకు కల్పిస్తున్నాం. ఆన్లైన్ టికెట్ విక్రయాలపై సందేహాలు, నిధుల దుర్వినియోగం, మళ్లింపు వంటివి జరుగుతాయని ఆందోళన అక్కర్లేదు” అని పేర్కొన్నారు.

మరోపక్క కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను జూన్ 15కు వాయిదా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మల్టీ ప్లెక్స్ థియేటర్ల టికెట్ ధరల్లోనే సర్వీసు ఛార్జీలను చేర్చుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 7న జీవో ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ మల్టీ ప్లెక్స్ అసోసియేషన్ తరఫున ఫరీద్ బిన్ అవధ్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా టికెట్ ధరలను నిర్ణయించేందుకు గతేడాది డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.