నవయుగ కేసులో జగన్‌కు చుక్కెదురు
పోలవరం హైడల్ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు నిలుపుదల చేసింది. రూ. 4,987 కోట్లతో ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ ఇవ్వడంతో నవయుగ కంపెనీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని సూచించింది.
హైకోర్టు తీర్పుపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ముర్ఖంగా ఉన్నాయన్నారు. ప్రాజెక్టుతో ప్రయోగాలు చేయవద్దని సూచించారు. ఒక్కసారి కోర్టు కేసులు మొదలైతే ప్రాజెక్టు పనులు మందగించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. టెండర్ల రద్దుపై కేంద్రం కూడా అనేక సార్లు హెచ్చరించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
గతంలో జరిగిన టెండర్ల పక్రియపై జగన్ ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసింది. విచారణ జరిపిన కమిటీ రూ. 3,600 కోట్ల అంచనాలు పెరిగాయని వెల్లడించింది. ప్రజా ధనం ఆదా చేసేందుకు ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై హైకోర్టుకు వెళ్లిన నవయుగ కంపెనీ కోర్టు ముందు తమ వాదనలు వినిపించింది. తాము ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని చెప్పింది. అధికారుల కారణంగా పనులు ఆలస్యం అయ్యాయే తప్ప తమ తప్పేమి లేదని పేర్కొంది. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ నిలిపివేసింది.