ఏపీ హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు.. విచారించే హక్కు లేదు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు.. విచారించే హక్కు లేదు

May 3, 2022

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ వ్యభిచార గృహానికి వెళ్లిన విటుడి (కస్టమర్) విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడిపై ఉన్న కేసును రద్దు చేసింది. ఇంతకు ఆ కేసు ఏంటీ? ఎందుకు హైకోర్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది? అనే వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా నగరంపాలెం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తనపై 2020లో పోలీసులు కేసు నమోదు చేశారని, ఆ కేసు గుంటూరులోని మొదటి తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు (ప్రత్యేక మొబైల్ కోర్టు) చాలా రోజులుగా విచారణ జరుపుతోందని, తనపై ఉన్న కేసును వెంటనే రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు.

అతడి తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపిస్తూ.. ‘2020 అక్టోబరు 10న పోలీసులు పిటిషనరుపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరిపి, సంబంధిత కోర్టులో అభియోగపత్రం వేశారు. వ్యభిచార గృహంపై దాడి చేసినప్పుడు అక్కడ పిటిషనరు కస్టమర్‌గా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వ్యభిచార గృహాన్ని నిర్వహించేవారు, ఇంటిని వ్యభిచారం కోసం ఇచ్చేవారిపై కేసు పెట్టి విచారించవచ్చుగానీ, సొమ్ము చెల్లించి విటుడిగా వెళ్లిన వ్యక్తిని విచారించడానికి వీల్లేదని చట్ట నిబంధనలు చెబుతున్నాయి. వ్యభిచార గృహానికి వెళ్లిన కస్టమర్‌పై నమోదైన కేసును ఇదే కోర్టు గతంలో కొట్టేసింది” అని గుర్తు చేశాడు.

అనంతరం వాదోపవాదనలు విన్న హైకోర్ట్ ధర్మాసనం.. ‘వ్యభిచార గృహానికి వెళ్లిన విటుడు కస్టమర్. న్యాయస్థానంలో అతడిని ఎలా విచారిస్తారు. ఆ హక్కు కోర్టుకు లేదు. అతడిపై పెండింగులో ఉన్న కేసును కొట్టివేస్తున్నాం” అని తీర్పును వెలువరించింది.