మహిళలను బూటుకాళ్లతో తన్నుతారా.. హైకోర్టు కన్నెర్ర - MicTv.in - Telugu News
mictv telugu

మహిళలను బూటుకాళ్లతో తన్నుతారా.. హైకోర్టు కన్నెర్ర

January 17, 2020

gbh

ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల పట్ల కఠినంగా వ్యవహరించడాన్ని తప్పుబట్టింది. రాజధాని ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న 610 మందిని ఎందుకు అరెస్టు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. మహిళలను మగ పోలీసులు కొట్టారా, బూటు కాళ్లతో తన్నారా అంటూ ప్రశ్నించింది. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేయవద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. 

2014 నుంచి రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ధర్మాసనానికి వివరణ ఇచ్చారు. వాటినే పోలీసులు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి మరి రాజధాని వీధుల్లో పోలీసులు మార్చ్ ఫాస్ట్, పరేడ్ ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులపై వివరణ కోరగా అంతా ప్రశాంతంగా ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇంకా బలగాలు ఎందుకు అక్కడ మోహరించారంటూ ప్రశ్నించింది. తదుపరి విచారణ  ఈనెల 20కి వాయిదా వేసింది. దీనిపై సుమారు గంట సేపు దీనిపై వాదనలు జరిగాయి.