AP is going to rewrite history.. Human migration less than 2.47 lakh years ago
mictv telugu

చరిత్రను తిరగరాయబోతున్న ఏపీ.. 2.47 లక్షల ఏళ్ల కిందటే మానవ సంచారం

August 11, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో చరిత్రను తిరగరాయబోతున్నది. 2.47 లక్షల ఏళ్ల కింద మానవ సంచారానికి సంబంధించిన ఓ రాతి పనిముట్లు ప్రకాశం జిల్లాలోని హనుమంతునిపాడు వద్ద లభ్యమైయ్యాయి. దాంతో అధికారులు వాటిని అహ్మదాబాద్‌‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్‌కు పంపించారు. అనంతరం ఆ పనిముట్లను పరిశీలించిన నిపుణులు పలు సంచలన విషయాలను వెల్లడించారు.

”2018లో ఏపీలోని కనిగిరి సమీపంలో ఉన్న పాలేరు నదీతీరంలో వడోదరకు చెందిన మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న దేవర అనిల్ కుమార్ ఆధ్వర్వంలో తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాల్లో ఈ పనిముట్లు దొరికాయి. వెంటనే వాటిని అహ్మదాబాద్‌లో ఉన్న ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్‌కు పంపిండంతో సైంటిఫిక్ డేటింగ్ విధానంలో వాటిని పరిశీలించాం. పరిశీలనలో ఇవి 2.47 లక్షల ఏళ్ల నాటివని తేలింది. అంటే హోమోసెపియన్స్ కంటే కొన్ని లక్షల సంవత్సరాల ముందే ఆంధ్రప్రదేశ్‌లో ఆదిమ మానవులు జీవించారన్న విషయం వెల్లడైంది” అని నిపుణులు అన్నారు.

మరోపక్క ఆధునిక మానవులు (హోమోసెపియన్స్) 1.22 లక్షల ఏళ్ల కిందట ఆఫ్రికా నుంచి భారత్‌కు వలస వచ్చారని, వస్తూ, వస్తూ తమతోపాటు రాతి పనిముట్లను కూడా తెచ్చారని ఇప్పటివరకు అందరూ అంగీకరిస్తున్నారు. కానీ, అంతకుముందే ఆంధ్రప్రదేశ్‌లో ఆదిమ మానవులు సంచరించారన్నదానికి ప్రకాశం జిల్లాలో లభ్యమైన లక్షల ఏళ్ల నాటి రాతి పనిముట్లే నిదర్శనంగా నిలిచాయని, వీటిని ఆనాటి హోమో ఎరక్టస్ జాతి ఆదిమమానవులు వినియోగించి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. తద్వారా హోమోసెపియన్స్ సిద్ధాంతం తెరమరుగమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయని వివరాలను వెల్లడించారు.