AP: Jagan shocked over the auto incident.. Ten lakh compensation
mictv telugu

ఏపీ: ఆటో ఘటనపై జగన్ దిగ్భ్రాంతి.. పది లక్షల పరిహారం

June 30, 2022

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద గురువారం ఉదయం కూలీపని కోసం వెళ్తున్న ఓ ఆటోపై విద్యుత్ తీగలు తెగిపడి ఐదుగురు మహిళలు సజీవదహనమైన ఘటనపై జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయాల చొప్పున పరిహారం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం కోసం రెండు లక్షల రూపాయలను పరిహారంగా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.

అయితే, ప్రమాద సమయంలో 12 మంది ఆటోలో ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మృతిచెందిన వారిని గుడ్డంపల్లి వాసులుగా అధికారులు గుర్తించారు. కాంతమ్మ, రాములమ్మ, రత్తమ్మ, లక్ష్మీదేవి, పెద్దకోట్లకు చెందిన కుమారి అనే మహిళలు మృతి చెందారని, మరో ఇద్దరు మహిళలకు తీవ్రంగా గాయాలు కాాగా, వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

మరోపక్క ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు చెప్పిన వ్యాఖ్యలు రాష్ట్రమంతటా హాట్ టాఫిక్‌గా మారాయి. విద్యుత్ తీగల నుంచి స్తంభంపై ఉన్న ఇనుప బ్లాంప్ మీదకు ఉడుత దూకడంతో ఎర్తింగ్ రావడంతో తీగలు తెగి ఆటోపై పడ్డాయని అన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు.