ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఓ తీపికబురును చెప్పారు. అమరావతిలోని తన క్యాంప్ ఆఫీస్‌లో విద్యాశాఖ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. సమావేశంలో భాగంగా రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి క్లాసులో ఇకపై డిజిటల్ బోధన చేయాలని అధికారులకు జగన్ ఆదేశించారు. ఇంటరాక్టివ్ డిస్ ప్లే లేదా ప్రొజెక్టర్లతో బోధనను అందిస్తే, బడి పిల్లలకు మరింత విజ్ఞానం పెరుగుతుందని అన్నారు. అనంతరం అధికారులు రాష్ట్రంలో నాడు-నేడు రెండో దశ కింద 22,344 స్కూళ్లలో చేపడుతున్న పనులు, అభివృద్ది ప్రగతి గురించి జగన్‌కు వివరించారు. విద్యావ్యవస్థలో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి డేటాను ఎప్పటికప్పుడు అప్లోడ్ అయ్యేలా చూడాలని జగన్ పేర్కొన్నారు.
అనంతరం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..” రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయండి. డీఈవో, ఎంఈవో సహా వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ బాధ్యతలున్న పోస్టులను వెంటనే భర్తీ చేయండి. ఎస్సీఈఆర్టీ, డైట్ సీనియర్ లెక్చరర్స్, డైట్ లెక్చరర్స్ పోస్టుల భర్తీ పైనా దృష్టి పెట్టండి. రెండో దశ నాడు–నేడు పనులను వేగవంతం చేయండి. స్కూళ్లలో విలువైన ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నాము. కావున భద్రత దృష్ట్యా తగిన చర్యలు తీసుకోండి. అన్ని స్కూళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై ఆలోచన చేయండి. టాయిలెట్ మెయింటెనెన్స్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్స్‌ను సమర్థవంతంగా వినియోగించుకోండి. పీపీ – 1 నుంచి రెండో తరగతి వరకూ స్మార్ట్ టీవీలు, 3వ తరగతి ఆపైన ప్రొజెక్టర్లు పెట్టేలా ఆలోచన చేయండి” అని ఆయన అన్నారు.