ఆంధప్రదేశ్‌లో గతకొన్ని సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు జగన్ మోహన్ రెడ్డి శుభవార్తను చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నియామకాలతో 896 మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలకు సంబంధించి విధివిధానాలకు సంబంధించిన నిబంధనలను జగన్ ప్రభుత్వం ఖరారు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ, జిల్లా కలెక్టర్ల పూల్ కింద కారుణ్య నియామకాలు చేపట్టాలని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
”ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ముందు సర్వీసులో ఉండగా.. 896 మంది ఉద్యోగులు మరణించారు. 2016 నుంచీ సర్వీసులో ఉండి. మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది. విలీనమైన తరువాత సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య నియామకాలు కూడా చేపట్టింది. కాగా అంతకుముందు 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న 896 కారుణ్య నియామకాలు కూడా చేపట్టాలని జగన్ ఇటీవల ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ, కలెక్టర్ పూల్‌కింద ఉన్న ఉద్యోగాల్లో నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది” అని ఉత్తర్వుల్లో పేర్కొంది.