AP: Jagan's sensational decision..Women drivers in RTC
mictv telugu

ఏపీ: జగన్ సంచలన నిర్ణయం..ఆర్టీసీలో మహిళా డ్రైవర్లు

July 26, 2022

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏపీఎస్‌ ఆర్టీసీలో మహిళా డ్రైవర్లు రానున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఇప్పటివరకూ మహిళలను కండక్టర్లుగా నియమించిన ప్రభుత్వం వారికి శిక్షణ ఇచ్చి డ్రైవర్లుగా ఆర్టీసీలో నియమించుకోబోతోందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, ఈ మహిళ డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి, ఎవరు అర్హులు? ఎన్ని రోజులపాటు శిక్షణ ఇస్తారు? ఎలా ఎంపిక చేస్తారు? అనే తదితర విషయాలను ఆయన వివరించారు.

”ఏపీఎస్ ఆర్టీసీ మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు బస్సుల్లో మహిళా కండక్టర్లను చూసిన మనం ఇకపై వారిని డ్రైవర్లుగానూ చూడబోతున్నాం. రాష్ట్రంలోని ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికను తయారుచేశాం. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా శిక్షణ పొందే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేయనున్నాం. దీనిపై ఇప్పటికే 13 ఉమ్మడి జిల్లాల ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ)లకు ప్రాథమికంగా ఆదేశాలిచ్చాం. పదో తరగతి పాసైన వారు శిక్షణకు అర్హులు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తాం. వారికి ఉమ్మడి జిల్లాల్లోని అందుబాటులో ఉన్న ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూళ్లలో 32 రోజుల పాటు శిక్షణ ఇస్తాం. ఆర్టీసీ బస్సుపైనే శిక్షణ ఇచ్చి, వారికి డ్రైవింగ్‌లో మరిన్ని మెలకువలు తెలుసుకునేలా ఈ శిక్షణ ఇస్తాం. ఆ తర్వాత ఆర్టీసీకి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం నగదు చెల్లిస్తుంది.” అని ఆయన అన్నారు.

అయితే, శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థులకు ఆర్టీసీలోనే డ్రైవర్‌గా పోస్టింగ్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డ్రైవింగ్‌లో శిక్షణతో పాటు మహిళలకు హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌‌ను కూడా ప్రభుత్వమే ఇప్పిస్తుంది. వారిలో అర్హత, నైపుణ్యాన్ని బట్టి తొలి దశలో ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఎస్సీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల్లో నియమించేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నట్లు.., సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు.