ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదింటి ఆడపడుచులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఓ శుభవార్తను చెప్పింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అర్హులైనవారికీ వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద ఆర్థికసాయం అందజేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా తెలియజేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మిక కుటుంబాలకు ఆర్థికసాయం సాయం వర్తించనుందని పేర్కొన్నారు. పేద ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నామని ఆయన తెలియజేశారు.
”ఈ పథకం ద్వారా.. ఎస్సీలకు వైఎస్సార్ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు. ఎస్సీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు. ఎస్టీలకు వైఎస్సార్ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు. ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు. బీసీలకు వైఎస్సార్ కల్యాణమస్తు కింద రూ.50వేలు. బీసీల కులాంతర వివాహాలకు రూ.75వేలు. ఇక, మైనారిటీలకు షాదీ తోఫా కింద లక్ష రూపాయలు. దివ్యాంగులు వివాహాలకు రూ. 1.5 లక్షలు. భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40వేలు ఆర్థిక సాయం అందిస్తాం” అని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
అర్హతలు ఇవే..
”ఈ రెండు పథకాలను అక్టోబర్ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సవాలయాల ద్వారా అమలు చేస్తారు. ఆ రోజు నవశకం-మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు. వివాహ తేదీ నాటికి పధువు వయస్సు 18. వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. తొలి వివాహానికి మాత్రమే అర్హత. వధువు, వరుడు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. (ఈ షరతుకు 2024 జూన్ 30 వరకు సడలింపు ఇస్తారు). వరుడు, వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేల రూపాయల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయల్లోపు ఉండాలి. మూడు ఎకరాలకు మించి మాగాణి, లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండొచ్చు. కుటుంబాల్లో సభ్యులెవ్వరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగిగా, పెన్షనర్‌గా ఉండకూడదు.
అయితే, పారిశుధ్య కుటుంబాలకు మినహాయింపు ఉంది. నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు) నెలవారీ విద్యుత్ వినియోగం (గత 12 నెలల సగటు) 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. ఏ కుటుంబమూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు. మునిసిపల్ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మించిన ఆస్తిని కలిగి ఉండకూడదు. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకం నిర్వహణ ఉంటుంది.”