కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. గడియారం స్తంభం సెంటర్ దగ్గర జిల్లా పేరు మార్చవద్దంటూ కోనసీమ జిల్లా సాధన సమితి ఆందోళన చేపట్టింది. ‘కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు’ అంటూ వందలాది యువకుల నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. వారి ర్యాలీని కలెక్టరేట్పై వెళ్లకుండా పోలీసులు వాహనాలను అడ్డుగా ఉంచారు. ఈ క్రమంలో కొంతమంది ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకున్న కొంతమంది యువకులు పోలీసులపై రాళ్లు విసిరారు. కలెక్టరేట్ వద్ద ఆందోళనకారులు బస్సును దగ్ధం చేశారు. కామనగరుపులోని మంత్రి విశ్వరూప్ క్యాంపు కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేశారు. ఆయన ఇంట్లోని మూడు కార్లను తగులబెట్టారు. కార్యాలయంలోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు.
ఇటీవల కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమగా పేరు మార్పు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాను కొనసాగించాలని ఆందోళనలు చేస్తున్నారు. యువత, జేఏసీ నేతలు పలుమార్లు ఆందోళనలు వ్యక్తం చేశారు. అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. కానీ వాటిని పట్టించుకోలేదు. దీంతో అమలాపురంలో కలెక్టరేట్ ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కాస్త ఉద్రిక్తంగా మారింది.