టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ విస్తరణపై ప్రణాళికలో తొలి అడుగు పడింది. ఏపీకి చెందిన నేతలు సోమవారం ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, మాజీ అధికారి తోట చంద్రశేఖర్, పార్థసారథిలతో పాటు జేటీ రామారావు, రమేశ్ నాయుడు, టీజే ప్రకాశ్, శ్రీనివాస్ నాయుడు, నయీముల్ హక్, మణికంఠ, ఫణికుమార్, వంశీలకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు వీరంతా ఏపీ నుంచి ప్రగతిభవన్ కి చేరుకున్నారు. వీరిలో తోట చంద్రశేఖర్ ని ఏపీ అధ్యక్షుడిగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈయన గత ఎన్నికల్లో జనసేన తరపున గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ మిగతా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరణ, దేశ వనరులు, సమస్యలు, ఏపీ రాజకీయాలు, నేటి నాయకుల తీరు వంటి పలు అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. కేవలం దేశం బాగు కోసమే బీఆర్ఎస్ పార్టీ పెట్టానని స్పష్టం చేశారు.