AP Links With Delhi Liquor Scam:MP magunta Clariety
mictv telugu

ఏపీ సర్కార్‌కు ఢిల్లీ లిక్కర్ కేసు టెన్షన్

December 1, 2022


ఢిల్లీ లిక్కర్ కేసు ఏపీ ప్రభుత్వాన్ని కలవరపెడుతుంది. ఈ కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అంతకుముందు రాజ్యసభ్యులు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి అరెస్టు అయ్యారు. ఇది విపక్షాలకు మంచి అస్త్రంగా మారింది.జగన్ సర్కార్‌ని టార్గెట్ చేస్తూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏపీ లింకులేంటి?అసలేం జరిగింది? వీరిపేర్లు ఎందుకు తెరపైకి వచ్చాయి.

లిక్కర్ కేసు సెగ

ఢిల్లీ లిక్కర్ కేసు తెలుగురాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. 36 మందిలో ఎనిమిది మంది తెలుగువాళ్ల పేర్లు బయటకొచ్చాయి.ఇందులో విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే అరెస్టు అయ్యారు. ఇప్పుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు ఉంది. సౌత్ గ్రూప్‌ని వీళ్లిద్దరూ లీడ్ చేశారని ఈడీ పేర్కొంది. రూ.100 కోట్లను విజయ్ నాయర్‌కు పంపించారని ఆరోపించింది.

మాగుంట వెర్షన్

ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం లేదంటున్నారు ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి. అమిత్ అరోరా ఎవరో తనకు తెలియదంటున్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో తన పేరు చేర్చడంపై ఆశ్చర్యపోయానని చెప్పారు. మద్యం వ్యాపారాల్ని గతంలోనే మానేశానని మాగుంట వివరణ ఇచ్చారు. అమిత్ అరోరాతో కనీసం ముఖపరిచయం కూడా లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తనకు, తన కుటుంబానికిగానీ ఎలాంటి సంబంధం లేదన్నారు.

అసలు కేసు ఇది

ఢిల్లీలోని 32 జోన్లలో జోన్ల వారీగా లిక్కర్ లైసెన్సులు పొందిన వాళ్లలో సమీర్ మహేందు, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, అమిత్ అరోరాకు చెందిన కంపెనీలు ఉన్నాయి. మరికొన్ని కంపెనీల వెనుక ఎవరున్నరన్నది విచారణ జరుగుతోంది. లిక్కర్ విక్రయాల ద్వారా హోల్ సేల్ మద్యం సంస్థలకు వచ్చే లాభం పాలసీలో 5 శాతమే ఉంది. దీన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం ఏకంగా 12శాతానికి పెంచింది. ఇంత భారీగా పెంచడానికి అర్థంలేని కారణాలను చూపించారు. పెంచిన పర్సంటేజ్‌లో సగం ఆప్ నేతలకు ఇచ్చేలా డీల్ కుదిందని టాక్. కొన్ని నిర్ధారించిన ప్రాంతాల్లో షాపులు తీయలేమన్న పేరుతో లైసెన్స్ పొందిన వారి ఫీజుల్ని భారీగా తగ్గించారు. కానీ గత మూడేళ్ల ఈ పాలసీ కాలంలో సేల్స్ భారీగా పెరిగాయి. కొన్ని షాపులు తీయకపోవడం వల్ల వారికి ఎలాంటి నష్టం రాలేదు. కానీ లైసెన్స్ ఫీజు తగ్గించడం వల్ల వ్యాపారులకు రూ.719 కోట్లు అనసరలాభం కలిగించారు. ఈ మేరకు ఢిల్లీ ఖజానాకు నష్టం జరిగింది. లైసెన్స్ ఫీజులను తగ్గించడం, పలు ఇతర మినహాయింపులతో రూ.2,873 కోట్ల నష్టం వాటిల్లింది. ఆప్ కు కమీషన్ల కోసమే అత్యధికంగా మార్జిన్ పెట్టారని ఈడీ ఆరోపిస్తోంది.

విపక్షాలకు దొరికింది అస్త్రం
ఏపీలో ఢిల్లీ లిక్కర్ కేసు సెగలు రేపుతోంది. వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి ఏ చిన్న విషయం దొరికినా టీడీపీ రచ్చ చేస్తోంది. ఇప్పుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో ఎంపీ మాగుంట పేరు రావడం అస్త్రంగా దొరికింది. మొన్నటిదాకా విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు మాగుంట కేంద్రంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శాస్త్రాలు సంధిస్తారు. మరి జగన్ సర్కార్ కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి.