AP: Married victim of loan app harassment
mictv telugu

ఏపీ: లోన్‌ యాప్‌ వేధింపులకు వివాహిత బలి

July 12, 2022

దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా లోన్‌ యాప్ వేధింపులు తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవసరానికి లోన్ తీసుకున్న పాపానికి నిర్వాహకులు చెప్పిన టైంకి డబ్బులు చెల్లించకపోతే, వినియోగదారులను చిత్రహింసలకు గురుచేస్తూ, బ్లాక్ మెయిల్స్‌కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వివాహిత లోన్ యాప్ నిర్వాకులు పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామానికి చెందిన బండపల్లి ప్రత్యూష ఇండియన్‌ బుల్స్‌, రూపెక్స్‌ యాప్స్‌ నుంచి రూ.20,000 లోన్‌ తీసుకుంది. రూ.20 వేల రుణానికి లోన్‌ యాప్స్‌ నిర్వాహకులు రూ. 2 లక్షల వరకు వసూలు చేశారు. అయినా, ఇంకా డబ్బులు కట్టాలని, లేకుంటే ప్రైవేటు ఫోటోలు సోషల్‌ మీడియాలో పెడతామని కేటుగాళ్లు బెదిరించారు. రుణం తీర్చకపోతే బంధువులకు ఫోన్‌ చేసి చెప్తావని, సైబర్‌ నేరగాళ్లు భయపెట్టారు. అంతేకాదు, వాట్సాప్‌లో అసభ్యకర మెసెజ్‌లు పంపుతూ వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెందిన ప్రత్యూష ఇంటిపైన ఉన్న ఫ్లెక్సీ హోర్డింగ్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది” అని వివరాలను వెల్లడించారు.

తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరుకు చెందిన జాస్తి శ్వేతా చౌదరి (22)కి ఓ అపరిచిత వ్యక్తి ఆన్లైన్‌లో పరిచయమై, రూ.1.2 లక్షలు చెల్లిస్తే, రూ.7 లక్షలు తిరిగి వస్తాయని ఆశ చూపి, చివరికి ఆమెను వేధించడంతో తట్టుకోలేక చిల్లకల్లు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన మరవకముందే మరో వివాహిత లోన్ యాప్ వేధింపులకు తట్టుకోలేక ఇంటిపైన ఉన్న ఫ్లెక్సీ హోర్డింగ్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవటం తీవ్ర విషాదాన్ని నింపింది.