కృష్ణా నదికి భారీగా వరద వస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శనివారం శ్రీశైలం గేట్లు ఎత్తారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రాజెక్టు వద్ద పూజలు చేసి మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. దీంతో సుమారు 80 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. పై నుంచి లక్షా 12 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.
అందులో జూరాల నుంచి 81 వేల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 31 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతోంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రసుత్తం 882.5 అడుగుల నీరు ఉంది. గరిష్ట నీటి నిల్వ 215 టీఎంసీలకు గాను, 202 టీఎంసీల నీరు ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద స్థిరంగా వస్తుండడంతో ప్రాజెక్టులో 882 అడుగుల వద్ద నిటిని స్థిరంగా ఉంచి మిగులు నీటిని దిగువకు వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు రెండు తెలుగు రాష్ట్రాలు జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. తాజా పరిణామంతో శ్రీశైలానికి పర్యాటకులు పోటెత్తే అవకాశం ఉంది.