అమరావతి రాజధాని అంశంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోనైనా మార్పురావాలని మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లకు హితబోధ చేశారు. అమరావతి ప్రాంతంలోని నిజమైన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇక పవన్ కల్యాణ్ కు అంబటి నాలుగు సూటి ప్రశ్నలు వేశారు. ‘మళ్లీ భీమవరం నుంచి పోటీ చేస్తారా? గాజువాక నుంచి పోటీ చేస్తారా? కనీసం 25 స్థానాల్లోనైనా అభ్యర్ధులను నిలబెడతారా? వచ్చే ఎన్నికల్లో ఎవరితో కలిసి పోటీ చేస్తారు? దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
ఇక మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలిగే తాను అన్నీ వదులుకొని ఎక్కడికైనా వెళ్లిపోయేందుకు సిద్ధమని సవాల్ చేశారు. కనీసం వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో చెప్పగలరా అని నిలదీశారు. అమరావతి రాజధాని అన్నది పెద్ద స్కామ్ అని రైతులు తెలుసుకోవాలన్నారు.